What-is-gratuity-formula-death-cum-retirement-gratuiry-dcrg-details

What-is-gratuity-formula-death-cum-retirement-gratuiry-dcrg-details

గ్రాట్యుటీ ను గూర్చి తెలుసుకుందాం*

ఒక సంస్థలో 5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు సేవలందించినందు పొందే బహుమతే గ్రాట్యుటీ

మీకు గ్రాట్యుటీ గురించి ఏమైనా తెలుసా? పదవీ విరమణ సమయంలో మీరు దీనిని పొందుతారు. ఇది మీ జీతంలో ఒక భాగం. దేశంలోని చాలా మంది ప్రజలకు గ్రాట్యుటీ అంటే ఏమిటో కూడా తెలియందు. అలాగే దీనిపై పన్ను మినహాయింపు ఉంటుందన్న విషయం కూడా తెలియదు. ఈ ఆర్టికల్ ద్వారా మనం గ్రాట్యుటీ అంటే ఏమిటి? ఇది ఎలా లెక్కించబడుతుందో? దీనిలో ఎంత మొత్తానికి పన్ను మినహాయింపు వర్తిస్తుందో తెలుసుకుందాం.

గ్రాట్యుటీ అంటే ఏమిటి?

ఒక సంస్థలో నమ్మకంగా పనిచేస్తూ, 5 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు సేవలందించినందుకు గాను తమ ఉద్యోగికి సంస్థ డబ్బు రూపంలో ఇచ్చే బహుమతిని గ్రాట్యుటీ అంటారు.

ఒక్కో దేశానికీ ఒక్కో విధంగా గ్రాట్యుటీ పరిమితులు ఉన్నాయి. భారతదేశంలో ఈ పరిమితి రూ.10 లక్షలుగా ఉంది. అయితే 7వ వేతన సవరణ చట్టం అమలు తరువాత ఈ పరిమితిని రూ. 20 లక్షలకు పెంచారు. ప్రభుత్వేతర రంగాలలో 5 సంవత్సరాలుగా ఒకే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈ నిర్ణయం లాభాన్ని చేకూరుస్తుంది.

గ్రాట్యుటీ చెల్లింపు విధానం

ఉద్యోగ భవిష్య నిధి మాదిరిగానే గ్రాట్యుటీ కూడా పూర్తిగా యజమానే చెల్లిస్తాడు. సంస్థ యజమానే నేరుగా గ్రాట్యుటీ మొత్తాన్ని మీకు చెల్లించడమో లేదా బీమా సంస్థతో కలిసి గ్రూప్ గ్రాట్యుటి ప్లాన్ ను తీసుకోవడంలో అనేది యజమాని నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ బీమా సంస్థ ద్వారా చెల్లించినట్లయితే, ఉద్యోగి కూడా తన గ్రాట్యూటీ కోసం కొంత మొత్తాన్ని కాంట్రిబ్యూట్ చేయవచ్చు. అయితే ఇది తప్పనిసరి కాదు.

గ్రాట్యుటీని ఎలా లెక్కించాలి?

మీరు ఒక సంస్థలో 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత, సంవత్సరానికి 15 రోజులు చొప్పున గ్రాట్యుటీ లెక్కించబడుతుంది. పరిగణించవలసిన మొత్తం పని దినాల సంఖ్య 26. మీరు ఉద్యోగం చేసిన సంవత్సరాల ఆధారంగా ఇది లెక్కించబడుతుంది.

మీ ఉద్యోగ సర్వీస్ 6 నెలల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే, అప్పుడు అది ఒక సంవత్సరంగా పరిగణించబడుతుంది. ఉదాహరణకు మీ ఉద్యోగ సర్వీస్ వ్యవధి 5 ​​సంవత్సరాల 7 నెలలు ఉంటే, అప్పుడు ఇది 6 సంవత్సరాలుగా లెక్కించబడుతుంది.

గ్రాట్యుటీని లెక్కించేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన నిబంధనలు క్రింద తెలియచేయబడ్డాయి

చివరిగా తీసుకున్న జీతం (బేసిక్ పేతో కలిపి) అలాగే డియర్నెస్ భత్యం

మీ ఉపాధి సంవత్సరాల సంఖ్య 26 రోజులను పని దినాలుగా పరిగణనలోకి తీసుకుని సంవత్సరానికి 15 రోజుల జీతం చెల్లించడం

గ్రాట్యూటీని లెక్కించడానికి ఫార్ములా క్రింద ఇవ్వబడింది

జీతం x పని చేసిన సంవత్సరాల సంఖ్య x (15/26)

జీతం = బేసిక్ తో కలిపి నెల జీతం + డీఏ

గ్రాట్యూటీ లెక్కింపుకు ఉదాహరణ

మీరు గత 5 సంవత్సరాల 7 నెలల నుంచి ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నారనుకుందాం. దానికి గాను మీరు డీఏతో కలిపి నెలకు రూ. 50000 జీతంగా పొందుతున్నారు. అప్పుడు మీ గ్రాట్యుటీ ఈ విధంగా ఉంటుంది.

50000 * 6 * 15/26 = రూ .1,73,076.90

ఏ సమయంలో గ్రాట్యుటీ ఇవ్వబడుతుంది?

గ్రాట్యుటీ అనేది పెన్షన్ లాంటిది. ఒకే సంస్థలో 5 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసినట్లయితే, అలాంటి వారు గ్రాట్యుటీని పొందడానికి అర్హుడు.

గ్రాట్యుటీ చెల్లింపు ప్రమాణాలు క్రింద తెలుపబడ్డాయి:

ఉద్యోగి పదవీ విరమణ చేసినప్పుడు.

5 సంవత్సరాల సర్వీస్ పూర్తైన తర్వాత ఉద్యోగి రాజీనామా చేసినప్పుడు.

ఏదైనా ప్రమాదం జరిగి మరణం లేదా శాశ్వత వైకల్యం సంభవించినప్పుడు.

5 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన వ్యక్తి ప్రమాదం కారణంగా మరణించినా లేదా శాశ్వత వైకల్యానికి గురైన సందర్భంలో యజమాని ప్రతి ఉపాధి సంవత్సరానికి గాను 15/26 రోజులు చొప్పున గ్రాట్యుటీ చెల్లించాల్సి ఉంటుంది.

ఏ కంపెనీలు గ్రాట్యుటీని చెల్లించాల్సి ఉంటుంది?

గ్రాట్యుటీ చట్టం 1972లో ఆమోదించబడింది. ఈ చట్టం కర్మాగారాలు, గనులు మొదలైన కంపెనీలలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులకు వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం కనీసం 10 మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు గ్రిట్యుటీని చెల్లించాల్సి ఉంటుంది.

గ్రాట్యుటీని పొందేందుకు ఎవరు అర్హులు?

ఉద్యోగి గ్రాడ్యుటీని పొందేందుకు అర్హత సంపాదించడానికి మూడు ప్రమాణాలు ఉన్నాయి:

ఉద్యోగి సంస్థలో 5 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసి, తర్వాత పదవీ విరమణ చేసినా…

ఉద్యోగి అదే సంస్థలో 5 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసి, తర్వాత రాజీనామా చేసినా…

ఉద్యోగి సంస్థలో పని చేస్తున్నప్పుడు, ప్రమాదవశాత్తు చనిపోయినా, శాశ్వత వైకల్యానికి గురైన వారు.

సెక్షన్ 4 (2) నిబంధన ప్రకారం క్రింద ఇవ్వబడిన ప్రమాణాలను సంతృప్తిపరిచే ఉద్యోగి గ్రాట్యుటీకి అర్హులు

కంపెనీకి 6 పని దినాలు ఉన్నట్లయితే, ఉద్యోగి సంవత్సరానికి 240 రోజులు పనిచేయాలి.

ఒకవేళ కంపెనీకి 5 పని రోజులు మాత్రమే ఉన్నట్లయితే, ఉద్యోగి సంవత్సరానికి 190 రోజులు పనిచేయాలి.

ఉద్యోగి సంస్థలో పనిచేస్తున్నప్పుడు చనిపోయినా, శాశ్వత వైకల్యానికి గురైనట్లయితే ఈ నిబంధన వర్తించదు. ఆ సందర్భంలో సదరు సంస్థ ఉద్యోగికి గ్రాట్యుటీని అందిస్తుంది.

గ్రాట్యూటీకి పన్ను వర్తిస్తుందా?

ప్రస్తుత పరిస్థితిలో అందరు ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీపై పన్ను మినహాయింపు ఉంది. రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వ లేదా ప్రభుత్వం కింద పనిచేస్తున్న స్థానిక సంస్థలలోని ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్న గ్రాట్యుటీ మొత్తం మీద పన్ను ఉండదు.

ప్రభుత్వేతర సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులకు అందుతున్న గ్రాట్యుటీ మొత్తానికి పన్ను మినహాయింపు అనేది యజమాని సంస్థ గ్రాట్యుటీ చట్టం కింద కవర్ అయ్యిందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

1. యజమాని గ్రాట్యుటీ చెల్లింపు చట్టం కింద కవర్ అయినట్లయితే

ఒక వ్యక్తి ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నట్లైతే, తన సంస్థ గ్రాట్యుటీ చెల్లింపు చట్టం కింద కవర్ అయినట్లయితే, అతను తన సగం నెల జీతంపై పన్ను మినహాయింపు పొందవచ్చు. అనగా తన ఉద్యోగ సమయంలో ప్రతి సంవత్సరం 15 రోజుల జీతం.

2. యజమాని గ్రాట్యుటీ చెల్లింపు చట్టం కింద కవర్ అవ్వకపోయినట్లైతే

మీరు పనిచేస్తున్న సంస్థ గ్రాట్యుటీ చట్టం కింద కవర్ అవ్వకపోయినట్లైతే, మీరు కింద ఇవ్వబడిన మూడు ఎంపికలలో ఏదైనా ఒక పన్ను మినహాయింపును పొందవచ్చు. వాటిలో ఏది తక్కువగా ఉంటే దాని మినహాయింపు పరిగణించబడుతుంది.

రూ. 20,00,000 ఉద్యోగి అసలు గ్రాట్యుటీని అందుకున్నప్పుడు. ఉపాధి సమయంలో ప్రతి సంవత్సరం 15 రోజుల జీతం.

చివరి మాట

గ్రాట్యుటీ అనేది రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలు పెరగడమనేది ప్రైవేటు, పబ్లిక్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు మరింత లాభదాయకం. ఇందులో ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం గ్రాట్యుటీ మొత్తం పై పన్ను మిన‌హాయింపు పొందుతారు.