what-is-cloudburst-details

what-is-cloudburst-details

What Is Cloudburst: అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి..? ఎలా సంభవిస్తుంది..?

What Is Cloudburst: తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యల అనంతరం క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటనే చర్చ మొదలైంది..? క్లౌడ్ బరస్ట్ అంటే ఏమిటి..? అది ఎలా సంభవిస్తుంది..? ఎక్కడ ఎక్కువ సంభవిస్తుందో తెలుసుకోవడం కోసం ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. అసలు తెలంగాణలో సంభవించింది క్లౌడ్ బరస్టేనా కాదా..? అనే విషయం తెలుసుకోవడానికి జనం ఇంట్రెస్ట్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో క్లౌడ్ బరస్ట్ గురించి వాతావరణ శాఖ ఏం చెప్పిందో చూద్దాం.

గోదావరి పరివాహక ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈసారి భారీ వర్షపాతం నమోదైంది. దీంతో తెలంగాణ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది. ఆదివారం భద్రాచలం వద్ద వరద పరిస్థితులను సమీక్షించిన సీఎం కేసీఆర్.. క్లౌడ్ బరస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో క్లౌడ్ బరస్ట్ వెనుక విదేశాల హస్తం ఉండొచ్చని ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. ఇంతకు ముందు లద్దాఖ్, ఉత్తరాఖండ్‌లోనూ ఇలాగే క్లౌడ్ బరస్ట్ జరిగిందన్నారు.

క్లౌడ్ బరస్ట్ నిర్వచనం…
దాదాపు 20 నుంచి 30 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గంట వ్యవధిలో 100 మిల్లీమీటర్లకుపైగా వర్షపాతం నమోదైతే దాన్ని క్లౌడ్ బరస్ట్‌ అంటారని భారత వాతావరణ విభాగం పేర్కొంది. ఇలా ఒకేసారి కుండకు చిల్లుపడినట్లు వర్షం పడటం వల్ల వరదలు సంభవిస్తాయి. ఒకే చోట భారీ స్థాయిలో పడే వర్షాలు మన దేశంలో ఎక్కువగా హిమాలయ పర్వత ప్రాంతాల్లోనే చోటు చేసుకుంటాయి. ఇటీవల జూలై 8న జమ్మూ కశ్మీర్‌లో ఇలాంటి పరిస్థితే తలెత్తడంతో.. అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన వారిలో 16 మంది చనిపోగా 20 మందికిపైగా గాయపడ్డారు. కానీ వాస్తవానికి అది క్లౌడ్ బరస్ట్ కాదు.

క్లౌడ్ బరస్ట్ వల్ల తక్కువ సమయంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. కానీ అదే సమయంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే.. కొద్దిసేపట్లోనే ఎక్కువ వర్షం పడిన ప్రతి సందర్భాన్ని క్లౌడ్ బరస్ట్ అని అనలేం.

మన దేశంలో ఇప్పటి వరకూ ఎన్నిసార్లు క్లౌడ్ బరస్ట్ సంభవించిందనే కచ్చితమైన సమాచారం లేదు. అంతే కాదు క్లౌడ్ బరస్ట్‌లను వెంటనే గుర్తించడం కష్టంతో కూడిన పని. కానీ పర్వత ప్రాంతాల్లో క్లౌడ్ బరస్ట్ ఎక్కువగా సంభవిస్తుంది. దీనికి అక్కడి ఎత్తైన ప్రదేశం, నేల వాలు లాంటి భౌగోళిక పరిస్థితులే కారణం.

ఎలా సంభవిస్తుందంటే..?

పర్వత ప్రాంతాలు మిగతా ప్రాంతాల కంటే ఎత్తులో ఉంటాయి. ఇలాంటి ప్రదేశాలకు నీటిని మోసుకుపోయిన మేఘాలు.. సంతృప్త స్థాయికి చేరడం వల్ల వర్షించడానికి సిద్ధంగా ఉంటాయి. కానీ అక్కడి వేడి వాతావరణ పరిస్థితుల వల్ల వర్షించడం మేఘాలకు సాధ్యం కాదు. వర్షపు చినుకులు కిందకు పడే బదులు.. వేడి వాతావరణం వల్ల పైకి కదులుతాయి. దీంతో కొత్త వర్షపు బిందువులు ఏర్పడటంతోపాటు.. అప్పటికే ఉన్న వర్షపు చుక్కల పరిమాణం పెరుగుతుంది. కొంత సమయం తర్వాత వర్షపు బిందువులను మోయలేని స్థితికి మేఘాలు చేరుకుంటాయి. దీంతో ఒక్కసారిగా వర్షాన్ని కురిపిస్తాయి.

2013లో కేదార్‌నాథ్ ప్రాంతంలో వచ్చిన వరదలకు క్లౌడ్ బరస్ట్ కారణం. ఆ సమయంలో అక్కడ భారీ స్థాయిలో మేఘాలు ఏర్పడగా.. వాటి సాంద్రత కూడా అంతే వేగంగా పెరిగిపోయింది. దీని వల్లే క్లౌడ్ బరస్ట్ సంభవించి ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

సాపేక్ష ఆర్ధ్రత, మేఘాలు అప్పటికే గరిష్ట స్థాయికి చేరడం, అత్యల్ప ఉష్ణోగ్రతలు, గాలులు మెల్లగా వీయడం లాంటి పరిస్థితులు క్లౌడ్ బరస్ట్‌కు దారి తీశాయి.

గత ఏడాది దాదాపు ఇదే సమయంలో అమర్‌నాథ్ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. లక్కీగా కరోనా కారణంగా అప్పుడు అమర్‌నాథ్ యాత్రను రద్దు చేయడంతో ప్రమాదం తప్పింది.