incometax-2024-new-vs-old-tax-benefits

incometax-2024-new-vs-old-tax-benefits

Income Tax: పాత Vs కొత్త పన్ను విధానం – ఇప్పుడు దేనివల్ల ఎక్కువ ప్రయోజనం?

New Income Tax Slabs: కొత్త పన్ను విధానంలో స్లాబ్‌ల వల్ల ఒక్కో టాక్స్‌ పేయర్‌పై రూ.17,500 వరకు పన్ను భారం తగ్గుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు.

Old Vs New Income Tax Regime: ఆదాయ పన్నుకు సంబంధించి, కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. కొత్త పన్ను విధానానికి ప్రాధాన్యత ఇచ్చిన మోదీ సర్కారు, టాక్స్‌ శ్లాబ్‌లను మార్చింది. దీంతో పాటు, ఉద్యోగులకు ప్రామాణిక తగ్గింపు (Standard Deduction) పరిమితిని రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచింది. ఇది ఏకంగా 50% వెసులుబాటు.

కొత్త పన్ను విధానం ప్రకారం, రూ.7 లక్షల వరకు ఆదాయంపై పన్ను ఉండదు. దీనికి రూ.75,000 స్టాండర్డ్‌ డిడక్షన్‌ కలిపితే, మొత్తం 7 లక్షల 75 వేల రూపాయల (రూ.7,75,000) వరకు ఆదాయంపై టాక్స్‌ కట్టాల్సిన అవసరం లేదు. ఈ మార్పు వల్ల ఒక్కో టాక్స్‌ పేయర్‌కు అదనంగా రూ.17,500 వరకు ప్రయోజనం చేకూరుస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ చెప్పారు. అయితే, కొత్త పన్ను విధానంలో ఎలాంటి మినహాయింపులను క్లెయిమ్‌ చేసుకునేందుకు వీలుండదు. 

కొత్త పన్ను విధానంలో ఇప్పటివరకు అమల్లో ఉన్న టాక్స్‌ రేట్లు ఇవి:     

రూ.3,00,000 వరకు —– 0 టాక్స్‌ 
రూ.3,00,001 నుంచి రూ. రూ.6,00,000 వరకు —– 5% టాక్స్‌ 
రూ.6,00,001 నుంచి రూ.9,00,000 వరకు —– 10% టాక్స్‌ 
రూ.9,00,001 నుంచి రూ.12,00,000 వరకు —– 15% టాక్స్‌ 
రూ.12,00,001 నుంచి రూ.15,00,000 వరకు —– 20% టాక్స్‌ 
రూ.15,00,001 లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే —– 30% టాక్స్‌ 

కొత్త బడ్జెట్‌ (2024-25) ప్రకారం, కొత్త పన్ను విధానంలోని పన్ను శ్లాబ్‌ల్లో జరిగిన మార్పులు:   

రూ.3,00,000 వరకు —– 0 టాక్స్‌ 
రూ.3,00,001 నుంచి రూ. రూ.7,00,000 వరకు —– 5% టాక్స్‌ 
రూ.7,00,001 నుంచి రూ.10,00,000 వరకు —– 10% టాక్స్‌ 
రూ.10,00,001 నుంచి రూ.12,00,000 వరకు —– 15% టాక్స్‌ 
రూ.12,00,001 నుంచి రూ.15,00,000 వరకు —– 20% టాక్స్‌ 
రూ.15,00,001 లేదా అంతకంటే ఎక్కువ ఆదాయం ఉంటే —– 30% టాక్స్‌ 

పాత పన్ను విధానంలో మాత్రం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ఎలాంటి మార్పులు చేయలేదు.

పాత పన్ను విధానం ప్రకారం అమల్లో ఉన్న శ్లాబ్‌ రేట్లు:     

రూ. 2,50,000 లక్షల వరకు —– 0 టాక్స్‌ 
రూ. 2,50,001 నుంచి రూ.5,00,000 లక్షల మధ్య ఆదాయంపై 5% టాక్స్‌ 
రూ.5,00,001 నుంచి రూ.10,00,000 లక్షల వరకు ఆదాయంపై 20% టాక్స్‌ 
రూ.10,00,001 లేదా అంతకుమించిన ఆదాయంపై 30% టాక్స్‌ 

పాత పన్ను విధానం శ్లాబ్‌ రేట్లలో సీనియర్‌, సూపర్‌ సీనియర్‌ సిటిజన్లకు కొన్ని వెసులుబాట్లు ఇచ్చారు. దీంతోపాటు… ఈ విధానంలో టాక్స్‌ పేయర్లందరికీ (వయస్సుతో సంబంధ‍ం లేకుండా) కొన్ని పన్ను మినహాయింపులు, తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. HRA, LTA, సెక్షన్‌లు 80C, 80D, 80CCD(1b), 80CCD(2) సహా చాలా మినహాయింపులను ఈ విధానంలో క్లెయిమ్‌ చేసుకోవచ్చు.

ఏ పన్ను విధానం మేలు?
గృహ రుణం, 80C, 80D సెక్షన్ల కిందకు వచ్చే పెట్టుబడులు ఉన్న టాక్స్‌పేయర్లలో ఎక్కువ మంది పాత పన్ను విధానమే మేలని నమ్ముతున్నారు, మెజారిటీ వర్గం దానినే ఎంచుకుంటున్నారు. పెద్దగా పొదుపులు, పెట్టుబడులు లేని వ్యక్తులు, తమ వార్షికాదాయం ఎప్పటికీ రూ.7,50,000 దాటదని అంచనా వేస్తున్న ఉద్యోగులు కొత్త పన్ను విధానాన్ని ఫాలో అవుతున్నారు.

error: Content is protected !!