sbi-services-bank-services-holidays

SBI Services: ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. సెలవు రోజుల్లో కూడా బ్యాంకు సేవలు..!

బ్యాంకులకు వరుస సెలవులు వస్తున్నాయని తెలిస్తే కస్టమర్లకు ఆందోళన మొదలవుతుంది. ముందుగానే బ్యాంకు పనులు పూర్తి చేసుకోవడానికి, ఏటీఎంలో నగదు తీసుకోవడానికి బారులు తీరుతారు.

బ్యాంకు సేవలపై ఇంతగా ప్రజలు ఆధారపడి ఉన్నారు. అయితే తమ వినియోగదారులకు ఎస్‌బీఐ ఓ గుడ్‌న్యూస్‌ అందించింది. స్టేట్‌బ్యాంక్ కస్టమర్‌లు ఇకపై ఆదివారం కూడా బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. బ్యాంకింగ్ సేవలను సులభతరం చేయడంతో పాటు కస్టమర్‌లకు అంతరాయాలు లేకుండా సేవలు అందించడానికి ఎస్బీఐ ఇటీవల రెండు కొత్త టోల్ ఫ్రీ నంబర్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటి ద్వారా కస్టమర్లకు అన్ని రకాల సేవలను అందిస్తామని బ్యాంక్ ప్రకటించింది.

ఎస్‌బీఐ ప్రారంభించిన కొత్త టోల్ ఫ్రీ నంబర్‌లు 1800 1234, 1800 2100. వీటి ద్వారా 44 కోట్ల మంది ఎస్‌బీఐ కస్టమర్‌లకు నిరంతరాయంగా బ్యాంకింగ్ సేవలను అందించనుంది. జూన్‌ 26న ఆదివారం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చేసిన ఓ ట్వీట్‌లో.. ‘బ్యాంకింగ్ సమస్యలకు వీడ్కోలు చెప్పండి! ఎస్‌బీఐ కాంటాక్ట్ సెంటర్‌కు 1800 1234 లేదా 1800 2100 టోల్‌ఫ్రీ నంబర్ల ద్వారా కాల్ చేయండి’ అని పేర్కొంది. కొత్త పథకం ప్రకారం, ఎస్‌బీఐ కస్టమర్‌లు ఈ నంబర్‌లకు ఏ సమయంలోనైనా ఎక్కడి నుంచైనా డయల్ చేయవచ్చు. కాబట్టి ఇది సేవలను పొందడానికి బ్రాంచ్‌కి వెళ్లే సమయాన్ని ఆదా చేస్తుంది, ఇబ్బందులను దూరం చేస్తుంది. వెబ్‌సైట్ లేదా యాప్ సేవలను ఉపయోగించలేని వారికి, డిజిటల్‌ సేవలపై అవగాహన లేని వారికి టోల్‌ఫ్రీ నంబర్‌లు ఉపయోగపడతాయి.

ఎస్‌బీఐ టోల్ ఫ్రీ నంబర్‌ని ఉపయోగించి ఏ బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు?

ఎస్‌బీఐ టోల్ ఫ్రీ నంబర్‌లు అనేక బ్యాంకింగ్ సేవలను అందిస్తాయి. సేవలు 24×7 అందుబాటులో ఉంటాయి. అంటే కస్టమర్లు ఆదివారం, సెలవు దినాల్లో కూడా ఎస్‌బీఐ బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. ఎస్‌బీఐ టోల్ ఫ్రీ నంబర్లు 1800 1234 లేదా 1800 2100కి డయల్ చేసి కస్టమర్‌లు తమ ఖాతా బ్యాలెన్స్‌ని తెలుసుకోవచ్చు. అదే విధంగా చివరి ఐదు ట్రాన్సాక్షన్‌ల గురించి తెలుసుకోవచ్చు. ATM కార్డ్ బ్లాకింగ్ స్టేటస్‌ను, అలాగే కార్డ్ డిస్పాచ్ స్టేటస్‌ను కూడా తెలుసుకోవచ్చు. ఎస్‌బీఐ టోల్ ఫ్రీ నంబర్‌కు డయల్ చేయడం ద్వారా, కస్టమర్‌లు తమ చెక్‌బుక్‌ల డిస్పాచ్ స్టేటస్‌ని కూడా తెలుసుకోవచ్చు. ఏదైనా కారణాల వల్ల మునుపటి ఏటీఎం కార్డ్‌ బ్లాక్ అయితే కొత్త ATM కార్డ్ కోసం అభ్యర్థించవచ్చు. SBI టోల్ ఫ్రీ నంబర్‌ని ఉపయోగించడం ద్వారా కస్టమర్‌లు వారి DS వివరాలను, డిపాజిట్ వడ్డీ ధ్రువీకరణ పత్రాన్ని ఇ-మెయిల్ ద్వారా పొందవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా ఉన్న ల్యాండ్‌లైన్‌లు, మొబైల్ ఫోన్‌ల నుంచి టోల్‌ఫ్రీ నంబర్‌లను డయల్ చేయవచ్చు. ఎస్‌బీఐ 24X7 హెల్ప్‌లైన్ నంబర్‌లు 1800 1234 (టోల్-ఫ్రీ), 1800 11 2211 (టోల్-ఫ్రీ), 1800 425 3800 (టోల్-ఫ్రీ), 1800 2100 (టోల్-ఫ్రీ) లేదా 080-26599990కు దేశంలోని అన్ని ల్యాండ్‌లైన్‌లు, మొబైల్ ఫోన్‌ల నుంచి డయల్‌ చేయవచ్చు. ఇప్పుడు అకౌంట్ బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్‌ల వివరాలను 24 గంటల్లో ఫోన్‌లో తెలుసుకోవచ్చు. డిపాజిట్లు & లోన్ స్కీమ్‌లు, ఇతర సేవల సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది.

ఈ నంబర్ల ద్వారా కూడా ఎస్‌బీఐని సంప్రదించవచ్చు:

టోల్ ఫ్రీ నంబర్: 1800 11 2211

టోల్ ఫ్రీ నంబర్: 1800 425 3800

టోల్ నంబర్: 080-26599990

మీరు బ్యాంక్ సేవల పట్ల అసంతృప్తి గా ఉంటే.. ఎస్‌బీఐ వెబ్‌సైట్ ప్రకారం 8008 20 20 20కి UNHAPPY అని రాసి SMS పంపవచ్చు.

error: Don\'t Copy!!!!