LIC-saral-pension-pension-plans-benefits-and-complete-details

LIC Saral Pension Plan: ఎల్ఐసీ నుంచి సరికొత్త పెన్షన్ ప్లాన్‌.. భారీగా ప్రయోజనాలు..

దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ మరో కొత్త పెన్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లో ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే.. జీవితాంతం పెన్షన్ లభించే సదుపాయం ఉంటుంది.

                  లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరో కొత్త పెన్షన్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2021 జూలై 1న సరల్ పెన్షన్ పేరుతో కొత్త ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది ఒక నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, సింగిల్ ప్రీమియం, ఇండివిడ్యువల్ ఇంటర్మీడియెట్ యాన్యువల్ ప్లాన్. ఇందులో ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే, జీవితాంతం పెన్షన్ వస్తుంది. పెన్షన్ కోసం రెండు యాన్యుటీ ఆప్షన్లను ఎల్‌ఐసీ అందుబాటులో ఉంచింది. ప్లాన్ కొనుగోలు చేసిన ఆరు నెలల తర్వాత వినియోగదారులు లోన్ సదుపాయాన్ని కూడా పొందవచ్చు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఎల్‌ఐసీ సరల్ పెన్షన్ ప్లాన్ పనితీరు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈ పెన్షన్ ప్లాన్‌లో పాలసీదారులు ఒకేసారి కొనుగోలు ధర మొత్తాన్ని చెల్లించి, జీవితాంతం క్రమం తప్పకుండా నిర్ణీత మొత్తాన్ని పెన్షన్‌గా పొందవచ్చు. పాలసీదారులు పొందగల మినిమం యాన్యుటీ సంవత్సరానికి రూ.12,000, నెలకు రూ.1,000 వరకు ఉంది. అయితే పాలసీ కనీస కొనుగోలు ధర అనేది పాలసీదారుడు పేర్కొన్న యాన్యుటీ రకం, ఆప్షన్, వయసు మీద ఆధారపడి ఉంటుంది. గరిష్ట కొనుగోలు ధరపై ఎలాంటి పరిమితి లేదు. పాలసీ ప్రీమియం పెరిగే కొద్దీ, పెన్షన్ కూడా పెరుగుతుంది.

                ఎల్‌ఐసి సరల్ పెన్షన్ ప్లాన్ పాలసీదారులకు రెండు ఆప్షన్లను అందిస్తుంది. మొదటి ఆప్షన్‌లో.. పాలసీదారుడు బతికి ఉన్నంత కాలం క్రమం తప్పకుండా పెన్షన్ వస్తుంది. వారి మరణానంతరం నామినీకి పాలసీ కొనుగోలు ధరను తిరిగి చెల్లిస్తారు. రెండో ఆప్షన్‌లో.. పాలసీదారుడు బతికి ఉన్నంత కాలం పెన్షన్ వస్తుంది. వారి మరణానంతరం జీవిత భాగస్వామి జీవించి ఉన్నంత కాలం పెన్షన్ వస్తుంది. భాగస్వామి కూడా చనిపోయిన తరువాత.. నామినీకి బీమా చేసిన మొత్తాన్ని తిరిగి ఎల్‌ఐసీ చెల్లిస్తుంది.

               పాలసీదారుడు నెలవారీగా, మూడు నెలలకు ఒకసారి, ఆరునెలలకు ఒకసారి, లేదా సంవత్సరానికి ఒకసారి పెన్షన్ తీసుకునే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

40 నుంచి 80 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు సరల్ పెన్షన్ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. మిగతా పాలసీల మాదిరిగానే ఇందులో కూడా లోన్ ఆప్షన్‌ను ఎల్‌ఐసీ కల్పిస్తోంది.

సరల్ పెన్షన్ ప్లాన్‌ కొనుగోలు చేసిన ఆరునెలల తరువాత, పాలసీపై లోన్‌ తీసుకునే సదుపాయాన్ని పొందవచ్చు.

error: Don\'t Copy!!!!